ఆమె ప్రేమకు పెద్ద పులులు సైతం చంటి పిల్లల్లా మారిపోతయ్
ఈ పేరు వినగానే మీసాలు తిరిగిన మగవాడికైనా సరే వణుకు పుట్టాల్సిందే. తన పంజా దెబ్బతో ఏనుగులాంటి పెద్ద పెద్ద జంతువులను కూడా ఇట్టే చంపగలదు పులి
దిశ, వెబ్ డెస్క్: పెద్ద పులి.. ఈ పేరు వినగానే మీసాలు తిరిగిన మగవాడికైనా సరే వణుకు పుట్టాల్సిందే. తన పంజా దెబ్బతో ఏనుగులాంటి పెద్ద పెద్ద జంతువులను కూడా ఇట్టే చంపగలదు పులి. కానీ అట్లాంటి పులులు కూడా ఓ మహిళ ప్రేమాప్యాయతల ముందు చంటి పిల్లల్లా మారిపోయాయి. ఆమె బుగ్గపై ముద్దులు పెడుతూ చిన్న పిల్లల్లా ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఇది నిజం. ఇక ఈ దృశ్యానికి సాక్షిగా నిలిచింది బెంగళూరు విధాన సభకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న బన్నేరుగట్ట బయాలాజికల్ పార్కు. 731 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ పార్కులో 102 జాతులకు చెందిన మొత్తం 2300 జంతువులు ఉన్నాయి. సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, ఒంటెలు వంటి ఎన్నో జంతువులు ఉన్నాయి. ఇక ఈ పార్కులోనే సావిత్రి అమ్మ పని చేస్తోంది.
2002లో భర్త చనిపోయాక సావిత్రి అమ్మ ఈ పార్కులు క్లీనింగ్ సిబ్బందిగా జాయిన్ అయ్యింది. అయితే ఆమె జంతువుల పట్ల చూపెడుతున్న ప్రేమాప్యాయతలను గుర్తించిన అధికారులు ఆమెను జూ హాస్పిటల్ కేర్ టేకర్ గా ప్రమోట్ చేశారు. ఇక్కడే ఆమె గాయాలపాలైన లేక తల్లిని పోగొట్టుకున్న పులి పిల్లలకు ప్రేమగా చూసుకుంటుంది. అచ్ఛం కన్నతల్లిలా చూసుకుంటూ ఆ జంతువులకు తల్లిగా మారింది. ఈ క్రమంలోనే పులి, చిరుత పులులు ఆమె ముందు చంటి పిల్లల్లా మారిపోతాయి. కేజ్ లోకి ఆమె రాగానే పులి పిల్లలు ఆమె చుట్టూ చేరి నానా అల్లరి చేస్తుంటాయి. సావిత్రి అమ్మ వాటిని పేర్లతో పిలుస్తూ ఆలనాపాలనా చూస్తుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి ప్రేమ ముందు క్రూరమృగాలు సైతం చంటి పిల్లల్లా మారిపోయాయంటూ నెటిజన్లు ఆమె ప్రశంసిస్తున్నారు.
Also Read: జీవితకాలాన్ని పెంచుతున్న టౌరిన్ విటమిన్.. అధ్యయనంలో వెల్లడి