Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ గా సత్ శర్మ
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ(BJP) చీఫ్ ని మారుస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ(BJP) చీఫ్ ని మారుస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ గా సత్ శర్మ(Sat Sharma)ను నియమించింది. 2018 నుంచి జమ్ముకశ్మీర్ చీఫ్ గా రవీందర్ రైనా(Ravinder Raina) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రైనాను బాధ్యతల నుంచి తప్పించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రవీందర్ రైనాను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆమోదం తర్వాతే ఈ నోటీసులు జారీ చేశామని అరుణ్ సింగ్ తెలిపారు.
ఆరేళ్ల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశం
ఆరేళ్ల విరామం తర్వాత నవంబర్ 4న కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఇకపోతే, బీజేపీ ఎమ్మెల్యేలందరూ శాసనసభ ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం కానుంది. ఈ సమావేశానికి మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ భేటీ తర్వాత ప్రతిపక్ష నేతను ఎన్నుకుని ఆ పేరుని కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఎల్ఓపీగా సునీల్ శర్మ, డాక్టర్ దేవేందర్ మాన్యాలు ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాల తెలిపాయి. మరోవైపు, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూడా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి స్పీకర్ పేరును పార్టీ ఖరారు చేస్తుంది.