Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపికపై విచారణ.. బెంచ్ నుంచి వైదొలగిన సీజేఐ ఖన్నా

సీఈసీ, ఈసీ నియామకాలకు సంబంధించిన వ్యాజ్యాన్ని విచారించే బెంచ్ నుంచి సీజేఐ సంజీవ్ ఖన్నా తప్పుకున్నారు.

Update: 2024-12-03 13:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ (EC) నియామకాలకు సంబంధించిన వ్యాజ్యాన్ని విచారించే బెంచ్ నుంచి సీజేఐ సంజీవ్ ఖన్నా (Cji Sanjiv Khanna) తప్పుకున్నారు. సుప్రీంకోర్టు (Supreme court)లో ఈ అంశంపై మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే, జస్టిస్ సంజయ్ కుమార్‌ (Sanjay kumar)తో పాటు ధర్మాసనంలో ఉన్న ఖన్నా.. తాను పిల్‌ను విచారించలేనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు చెప్పారు. ఈ కేసు విచారణ మరోసారి జనవరి 6 నుంచి ప్రారంభం కానుండడంతో త్వరలోనే కొత్త బెంచ్ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ పిటిషన్లపై తమ స్పందనలను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ధర్మాసనం ఆదేశించింది.

కాగా, గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు సీఈసీ, ఈసీ నియామకాలపై తీర్పు ఇచ్చింది. సీఈసీ, ఈసీలను ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ నిర్ణయిస్తుందని తెలిపింది. ఇందులో ప్రధాన మంత్రి (Prime minister), ప్రతిపక్ష నేత (Apposition leader), సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా సైతం ఈ బెంచ్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. కానీ ప్రధాన న్యాయమూర్తిని ప్యానెల్ నుంచి తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని నియమించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ (Jaya takur), అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌)లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపైనే ప్రస్తుతం బెంచ్ విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఖన్నా తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News