Sanjay Raut: ఫడ్నవీస్‌పై ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దాడి చేస్తాయా?.. సెక్యురిటీ పెంపుపై సంజయ్ రౌత్ ఎద్దేవా
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ప్రమాదం పొంచి ఉందని సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)కు ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను(Secirity) పెంచింది. ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండగా అదనంగా ఫోర్స్ వన్ సిబ్బందిని కేటాయించింది. అయితే ఫడ్నవీస్‌కు భద్రత పెంపుపై శివసేన(UBT) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay raut) తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఫడ్నవీస్ మాకు మంచి స్నేహితుడు. భద్రతపై మేము ఆందోళన చెందుతున్నాం. కానీ ఫడ్నవీస్ ఎవరి నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఉక్రెయిన్(Ukrein), ఇజ్రాయెల్(Israel)లు ఆయనపై ఏమైనా దాడి చేసే అవకాశం ఉందా? లిబియా, ఉత్తర కొరియాలు అటాక్ చేస్తాయా?’ అని ఎద్దేవా చేశారు. ‘ఫడ్నవీస్‌కు ఎవరు ప్రమాదకరం? ఆయనే రాష్ట్ర హోం మంత్రి. సీఎం నుంచి ప్రమాదం ఉందా? తన భద్రతను ఎలా పెంచుతారు ఉగ్రవాదులతో పోరాడటానికి శిక్షణ పొందిన కమాండో దళాన్ని ఎలా మోహరిస్తారు?’ అని తెలిపారు. అలాగే ఫడ్నవీస్ సెక్యూరిటీ పెంపుపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సైతం స్పందించారు. ఫడ్నవీస్ కు ప్రాణహాని ఉందని భావిస్తే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.