కొందరు ఓట్లు వేస్తారు.. మరికొందరు చెంపదెబ్బలు కొడతారు: సంజయ్ రౌత్

హిమాచల్ మండి నుంచి కొత్తగా ఎంపీగా ఎన్నికైన సినీ నటి కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

Update: 2024-06-07 10:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ మండి నుంచి కొత్తగా ఎంపీగా ఎన్నికైన సినీ నటి కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మహిళా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కంగనా చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం దీనిపై స్పందించారు. కొందరు ఓట్లు వేస్తారు.. మరికొందరు చెంపదెబ్బ కొడతారు.. తన తల్లి కూడా రైతుల ధర్నాలో కూర్చున్నదని కానిస్టేబుల్ చెప్పింది. ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళను భారతమాతతో సమానంగా ఆ కానిస్టేబుల్ చూసింది. కంగనా వారికి వ్యతిరేకంగా మాట్లాడింది, ఎవరైనా భారత మాతను అవమానిస్తే కోపం వస్తుంది, అందుకే ఆమె కంగనా చెంపపై కొట్టింది. మండి నుంచి కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీని గౌరవించాలి, కంగనా పట్ల నాకు సానుభూతి ఉంది. ఆమె ఇప్పుడు ఎంపీ. ఎంపీపై దాడి చేయకూడదు, కానీ రైతులను కూడా గౌరవించాలని ఆయన అన్నారు.

రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు కుల్వీందర్ కౌర్ చెప్పారు. ఈ ఘటనపై స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆమె, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారు రూ. 100 తీసుకుని వచ్చారని కంగనా అంది.. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటారా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చెంపపై కొట్టినట్లు కౌర్ చెప్పింది. ప్రస్తుతం ఆమెను సస్పెండ్ చేశారు.


Similar News