Sanjay raut: మమతా బెనర్జీని అవమానించడం సరికాదు..కేంద్ర ప్రభుత్వంపై సంజయ్ రౌత్ ఫైర్

నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-07-28 08:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కానీ ఒక ముఖ్యమంత్రి గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కాబోవన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్య పద్దతికే పూర్తి విరుద్ధమని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఏకైక ప్రతిపక్ష సీఎం మమతా బెనర్జీ అని ఐదు నిమిషాల తర్వాత ఆమె మైక్ కట్ చేశారని.. ఇతర ముఖ్యమంత్రులకు మాత్రం మరింత సమయం ఇచ్చారని ఆరోపించారు.

‘కేంద్రం పంపిణీ చేసే డబ్బు భారతదేశ ప్రజలకు చెందినది. దీనిని వివిధ పన్నుల రూపంలో వసూలు చేస్తారు. కానీ కొన్ని రాష్ట్రాలను విస్మరించడం సరికాదు. బడ్జెట్ అనంతరం మహారాష్ట్ర సీఎం సైతం ఉత్త చేతులతో తిరిగొచ్చారు’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు సంజయ్ స్పందిస్తూ..శరద్ మాట్లాడింది నిజమేనని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షాపై ఉన్న కేసులన్నీ ఎత్తేశారని తెలిపారు. కాగా, మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ..సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News