సొంత పార్టీకి వరుస షాకులిస్తున్న సచిన పైలట్!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేత సచిన్ పైలట్ వరుస షాకులిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేత సచిన్ పైలట్ వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ప్రస్తుత కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లోత్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సొంత ప్రభుత్వంపై ఒక్కరోజు దీక్షకు దిగిన సచిన పైలట్ తాజాగా పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో ఆయన వైఖరి ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ జైపూర్ శివార్‌లో సీఎం అశోక్ గెహ్లోత్, పార్టీ ఇన్‌ఛార్జి సుఖ్ జిందర్ సింగ్ రంధావా, రాజస్థాన్ పీసీసీ గోవింద్ సింగ్ దోతస్రా ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకాకపోవడం పార్టీలో చర్చగా మరింది.
ప్రస్తుత సీఎం అశోఖ్ గెహ్లాత్‌కు సచిన్ పైలట్‌కు మధ్య రోజు రోజుకూ గ్యాప్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య సయోధ్యకు ఉపయోగపడుతుందని భావించిన మీటింక్‌కు సచిన్ పైలట్ దూరంగా ఉండటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అసలు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా లేక అదును చూసి కండువా మారుస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకంటే ముందే ఇతర కార్యక్రమాలు షెడ్యూల్ చేయడం వల్ల సచిన్ పైలట్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.