Russia : ఆర్మీలోకి భారతీయుల భర్తీని ఆపేశాం : రష్యా
దిశ, నేషనల్ బ్యూరో : తమ సాయుధ దళాలలోకి భారతీయులను రిక్రూట్‌మెంట్ చేయడాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆపేశామని రష్యా ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో : తమ సాయుధ దళాలలోకి భారతీయులను రిక్రూట్‌మెంట్ చేయడాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆపేశామని రష్యా ప్రకటించింది. వాలంటరీగా రష్యా సైన్యంలో సేవలు అందించడానికి ముందుకొచ్చిన వారిని రిలీవ్ చేసే ప్రక్రియను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది. ఈమేరకు ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా సైన్యంలోకి రిక్రూట్ అయిన 91 మంది భారతీయుల స్థితిగతులపై ఇరుపక్షాలు భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే రష్యా రాయబార కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.
భారత్‌తో పాటు ఇతర దేశాల పౌరులను కూడా ఆర్మీలో చేర్చుకోవడాన్ని ఆపేశామని రష్యా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. రష్యా ఆర్మీలో వలంటీర్లుగా చేరిన భారతీయులను రిలీవ్ చేసేందుకు ఇరుదేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం తరఫున పోరాడుతూ చనిపోయిన భారతీయులకు రష్యా రాయబార కార్యాలయం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. వారి కుటుంబాలకు కాంట్రాక్టు నిబంధనల ప్రకారం పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. కాగా, 69 మంది భారతీయ పౌరులు ప్రస్తుతం రష్యా సైన్యం నుంచి రిలీవ్ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.