న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేంద్ర జలశక్తి శాఖ కు చెందిన వాప్కోస్ (WAPCOS) సంస్థ మాజీ సీఎండీ రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్, ఘజియాబాద్ సహా దేశంలోని 19 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. మంగళవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. బుధవారం మరో రూ.18 కోట్లకు పైగా డబ్బును సీబీఐ అధికారులు సీజ్ చేశారు. భారీగా నగదుతో పాటు నగలు, విలువైన ఆభరణాలు, ఆస్తుల ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
2011 ఏప్రిల్ నుంచి 2019 మార్చి 31వరకు రాజిందర్ కుమార్ గుప్తా వాప్కోస్ సీఎండీగా ఉన్న సమయంలో భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. గుప్తా పదవీ విరమణ చేసిన తర్వాత ఢిల్లీలో ప్రైవేటు కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారనే ఆరోపణలు వచ్చాయి. ఆయనకు ఢిల్లీ,గురుగ్రామ్, పంచకుల, సోనిపట్, చండీగఢ్‌లలో ఫామ్ హౌస్‌లు ఉన్నట్టు అభియోగాలు దాఖలయ్యాయి. దీంతో రాజిందర్ కుమార్ గుప్తాతోపాటు ఆయన భార్య రీమా సింఘాల్, తనయుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.