Nehru : నెహ్రూ లేఖలను సోనియా తీసుకున్నారు.. మాకు అప్పగించండి : రాహుల్‌ను కోరిన పీఎం మెమోరియల్
దిశ, నేషనల్ బ్యూరో : భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ(Nehru) రాసిన లేఖలపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ(Nehru) రాసిన లేఖలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ లేఖలను తమకు తిరిగి అప్పగించాలంటూ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ప్రధానమంత్రి సంగ్రహాలయ) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లేఖ రాసింది. నెహ్రూ రాసిన లేఖలను 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తీసుకున్నారని, వాటిని తిరిగి తమకు అప్పగించాలని కోరింది. 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన నెహ్రూ లేఖలను సోనియాగాంధీకి పంపారని, అవి ఆమె వద్దే ఉన్నాయని ప్రధానమంత్రి సంగ్రహాలయ వెల్లడించింది. ఎడ్వినా మౌంట్‌బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖులతో నెహ్రూకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయని తెలిపింది.
ఈ లేఖలన్నీ తిరిగి అప్పగించాలని ఈ ఏడాది సెప్టెంబర్‌లో కోరిన ప్రధానమంత్రి సంగ్రహాలయ .. ఈనెల 10న మరోసారి రాహుల్ గాంధీకి లేఖ రాసింది. కనీసం ఆ లేఖల ఫొటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని అడిగింది. దేశ తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ లేఖలను చారిత్రక ప్రాధాన్యత ఉంది. వాటిని జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971 సంవత్సరంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. దేశ ప్రధానుల అరుదైన జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.