ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలు: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.

Update: 2024-06-03 06:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. సోమవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. ఫలితాలపై ప్రతి ఒక్కరూ వేచి చూడాలని, రిజల్ట్ ఇండియా కూటమికి అనుకూలంగా వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సోనియా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన రామ్‌గోపాల్‌ యాదవ్‌తో సహా ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా డీఎంకే కార్యాలయానికి వెళ్లి కరుణానిధికి నివాళులర్పించారు. కాగా, లోక్ సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  


Similar News