Maha Results: ‘మహా’ రిజల్ట్స్.. రిసార్టు రాజకీయం మొదలైంది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు (Maharastra Election Results) కౌంట్ డౌన్ ప్రారంభమైందనే చెప్పాలి. రేపే "మహా" సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా - నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు (Maharastra Election Results) కౌంట్ డౌన్ ప్రారంభమైందనే చెప్పాలి. రేపే "మహా" సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా - నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. బుధవారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమిదే విజయం అని తేలింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
అయితే ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ కూడా గెలుపు తమదవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. హర్యానా, జమ్ము ఎగ్జిట్ పోల్స్ తారుమారవ్వడంతో.. మహావికాస్ అఘాడీ గెలుపు ధీమాలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయుతి గెలిస్తే.. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారని అంటున్నారు. ఎన్సీపీనే సీఎం ఎన్నికలో కింగ్ మేకర్ అవుతుందంటున్నారు.
ఫలితాల నేపథ్యంలో మహారాష్ట్రలో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. మహావికాస్ అఘాడీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ముంబైలో ఉంటారని శివసేన యూటీబీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. తమ కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. గెలిచే అవకాశాలున్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తమకే మద్దతు ఇస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం పోస్టు కోసం ప్రస్తుతం ఎలాంటి ఫార్ములాను అనుసరించడం లేదని, ప్రతి ఒక్కరూ కలిసి తమ ప్రభుత్వ అధినేతను ఎన్నుకుంటారని వెల్లడించారు.