రాముడు వర్సెస్ రైతులు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్
బీజేపీ రాముడు సెంటిమెంట్ ను నమ్ముకుంటుంటే కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్ముకుంటోందా అనే టాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో:యావత్ దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. విజయతీరాలకు చేర్చుతుందనుకునే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి పార్టీలు వెనుకాడం లేదు. ఈ క్రమంలో మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ రాముడు సెంటిమెంట్ ను నమ్ముకుంటుంటే కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్ముకుంటోందా అనే టాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోరుతూ రైతులు 'ఢిల్లీ ఛలో' కార్యక్రమానికి పిలుపునివ్వగా వారికి కాంగ్రెస్ సపోర్ట్ గా నిలవడం ఆసక్తిగా మారింది.
రాముడిపై మోడీ.. రైతులపై రాహుల్:
హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఈ గెలుపు అవసరమనుకున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని మెజారిటీ హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మోడీ సెంట్రిక్ గా ఈ కార్యక్రమం జరిగిందనే టాక్ వినిపించింది. దీంతో రాముడి సెంటిమెంట్ బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టడం ఖాయం అనే ధీమా బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తే ఇండియా కూటమిలో మాత్రం చీలకలకు కారణం అయిందనే చర్చ జరుగుతోంది. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం ఇండియా కూటమిలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఇండియా కూటమి నుంచి ఒక్కోపార్టీ ఎగ్జిట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ రైతుల ఆందోళన కాంగ్రెస్ కు ఉతకర్రగా మారబోతున్నదా? అనేది చర్చగా మారింది. ఎంఎస్పీకి చట్టబద్దత కోరుతూ రైతులు ఆందోళనకు దిగగా రైతుల నిరసనలు కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రైతులపై లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్లు, బాష్ప వాయుగోళాలను ప్రయోగించింది. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం రైతులకు మద్దతుగా నిలవడం, తాము అధికారంలోకి వస్తే మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని ప్రకటించారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడి రాముడి సెంటిమెంట్ నమ్ముకుంటే రాహుల్ రైతుల సెంటిమెంట్ తో ముందుకు వెళ్లబోతున్నారా? అనేది చర్చగా మారింది.
హస్తం పార్టీకి ఆయుధం దొరికినట్లేనా?:
అబ్ కీ బార్ మోడీకి సర్కార్ అని ఇటీవలే ప్రధాని మోడీ ధీమాను వ్యక్తం చేశారు. భగవాన్ శ్రీరాముడు తన స్వంత ఇంటికి వచ్చాడని తాము ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను బట్టి బీజేపీ ఎజెండాలో శ్రీరాముడి సెంటిమెంట్ తో పాటు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అనే ఎజెండా ఉందనే విషయం అర్థమవుతుదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ధీమా ఇలా ఉంటే మోడీకి చెక్ పెట్టాలనే ఇండియా కూటమి ఆలోచనకు క్రమంగా బీటలు రావడం చర్చనీయాశంగా మారింది. ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ హవాను అడ్డుకోవాలని చూసిన ఇండియా కూటమి నుంచి ఇటీవల బిహాఆర్ సీఎం నితీశ్ కుమార్ వైదొలగడం కూటమిలో భారీ కుదుపుగా మారింది. ఆ తర్వాత ఆప్, టీఎంసీ సైతం ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలో కల్లోల పరిస్థితి నెలకొనగా తాజాగా మరోసారి రైతులు పోరుబాట పట్టడం కాంగ్రెస్ కు ఆయుధం దొరికినట్లేనా అనే చర్చ జరుగుతోంది. గతంలో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగివచ్చిన పాజిటివ్ కోణం ఉంది. దీంతో రైతుల ఆందోళనను తమ ఎజెండాగా సెట్ చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అనే టాక్ జాతీయ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే మరో వైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఎన్నికల వేళ రైతుల ఆందోళనలు రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది సస్పెన్స్ గా మారింది.