Rajya Sabha bypolls: రాజ్యసభ ఉపఎన్నికలు: బీజేపీ అభ్యర్థులు వీరే?
రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్‌లను బరిలోకి దింపింది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్‌లను బరిలోకి దింపింది. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి, ఇటీవల బిజూ జనతా దళ్(బీజేడీ) నుంచి బీజేపీలో చేరిన మమతా మొహంతాను ఒడిశా నుంచి, రాజీబ్ భట్టాచార్జీని త్రిపుర నుంచి అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే అసోం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తెలి, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్‌ను పోటీకి దింపింది. కాగా, సెప్టెంబరు 3న రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి.
కాగా, రాజస్థాన్ నుంచి బీజేపీ బరిలో నిలిపిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరగా లుథియానా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వడం తప్పనిసరి. ఇక, మోడీ కేబినెట్‌లో మత్స్యశాఖ, పశుసంవర్ధక-పాడిపరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా ఉన్న జార్జ్ కురియన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి.