సాయుధ బలగాల బలోపేతంతోనే ‘అభివృద్ధి చెందిన’ భారత్ : Rajnath Singh

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే.. సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.

Update: 2023-10-01 11:23 GMT

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే.. సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. డిమాండ్‌, సర్వీసు, నిధుల మధ్య సమతూకం పాటిస్తూ ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ (డీఏడీ) 276వ వార్షికోత్సవాల్లో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. డీఏడీని రక్షణ శాఖ నిధులకు సంరక్షక సంస్థగా అభివర్ణించారు. పెద్దపెద్ద బ్యాంకులు ఇంటర్నల్ రీసెర్చ్ టీమ్‌లను ఏర్పాటు చేస్తాయని, వాటిలాగే మార్కెట్‌ను శోధించేందుకు డీఏడీ కూడా ఒక రీసెర్చ్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్‌ సూచించారు.

రక్షణశాఖకు సంబంధించి ఆర్థిక సలహాలను అందించే క్రమంలో డీఏడీ అధికారులు ముఖ్యంగా 2 అంశాలను గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రక్షణశాఖ కోసం ఏదైనా పరికరంగానీ, టెక్నాలజీగానీ కొనాలని భావిస్తే.. అది ఎంతవరకు అవసరం..? దాని కోసం ఎంత వరకు ఖర్చు చేయొచ్చు..? అనే అంశాలపై అవగాహనతో ఉండాలన్నారు. అదే ప్రొడక్ట్‌ వేరేచోట తక్కువ ధరకే దొరుకుతున్నట్లయితే, కచ్చితంగా ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.


Similar News