ఓడినా సరే ప్రభుత్వ 100-రోజుల ఎజెండా అమలుపై పనిచేస్తాను: రాజీవ్ చంద్రశేఖర్

100 రోజుల ఎజెండాను ఇక్కడ అమలు చేయడంపై దృష్టి సారించినట్టు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Update: 2024-06-10 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో తిరవనంతపురం నుంచి పోటీ చేసి ఓడిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం పనిచేయడం కొనసాగిస్తానని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఆయన తిరవనంతపురంలో బీజేపీ 100 రోజుల ఎజెండా అమలుపై పనిచేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టిన వెంటనే తిరవనంతపురం ప్రజల సమస్యలపై పనిచేస్తామని చెప్పాను. అందుకోసం ప్రధానితో కలిసి పనిచేస్తానని, 100 రోజుల ఎజెండాను ఇక్కడ అమలు చేయడంపై దృష్టి సారించినట్టు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తన 18 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల పాటు ప్రధాని మోడీ నాయకత్వంలో మంత్రిగా చేసే అవకాశం లభించింది. ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన మొదట్లో లేదని, ఓటమి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం స్పందించారు. 'మీరు ప్రభుత్వంలో ఉన్న సమయంలో వివిధ సమస్యలపై మీతో చర్చించాను. ప్రజాసేవ ద్వారా దేశానికి మీరు మరెంతో సహకారం అందిస్తారనే నమ్మకం ఉంది. అందులో రాజకీయం అనేది ఒక మార్గం మాత్రమే. మీ భవిష్యత్తు కోసం ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.


Similar News