Raj Thackeray: ఆ సినిమాను మహారాష్ట్రలో రిలీజ్ చేయొద్దు.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే వార్నింగ్

‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయొద్దని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే థియేటర్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-22 10:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థానీ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ భారత్‌లో అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయొద్దని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. మూవీ విడుదలకు అనుమతిస్తే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ పేరుతో త్వరలో ఇండియాలో విడుదల కానుంది. ఈ సినిమాను మహారాష్ట్రలో రిలీజ్ చేయడానికి ఎంఎన్ఎస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించదు. పాకిస్థానీ నటుల చిత్రాలను భారత్‌లో ఎందుకు అనుమతిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. కళకు సరిహద్దులు లేవని కానీ.. భారత్‌లో పనిచేస్తున్న పాకిస్తానీ నటుల విషయంలో ఇది వర్తించబోదన్నారు.

ఈ చిత్రాన్ని మహారాష్ట్ర మాత్రమే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ విడుదల చేయడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఎంఎన్ఎస్ హెచ్చరికలు పట్టించుకోకుండా సినిమా ప్రదర్శనకు ముందుకెళ్తే థియేటర్ యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసని వెల్లడించారు. థియేటర్ యజమానులు కష్టాల పాలు కావొద్దని సూచించారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో ఎలాంటి వివాదం జరగకూడదని తమ పార్టీ కోరుకుంటోందని స్పష్టం చేశారు. కాగా, ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ 2022లో పాకిస్థాన్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే దీనిని ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. 


Similar News