Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో చొరబాటుకు యత్నం.. అడ్డుకున్న బీఎస్ఎఫ్ దళాలు

జమ్మూ కశ్మీర్‌లో ఓ ఉగ్రవాది చొరబాటుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ విఫలం చేసింది.

Update: 2024-09-22 12:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఓ ఉగ్రవాది చొరబాటుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ విజయవంతంగా అడ్డుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్ఎస్ పురా సరిహద్దు ప్రాంతంలోని కంచె వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి కదలికలను బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే స్పందించి అతనిపై పలు రౌండ్లు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే చొరబాటుదారుడు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వదిలిపెట్టి పారిపోయాడు. అనంతరం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఒక ఏకే 47 రైఫిల్, రెండు పిస్టల్స్, 20 రౌండ్ల మందుగుండు సామగ్రి ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక పాకిస్థాన్‌లో తయారు చేసిన బ్యాగ్, సిగరెట్ ప్యాకెట్, ఇతర వస్తువులు కూడా లభ్యమైనట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈనెల 16న పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరొక చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఒక పాక్‌ చొరబాటుదారుడిని హతమార్చింది.


Similar News