లాస్ ఏంజిల్స్‌ను కరుణించిన వరుణుడు.. ఇక్కడే మరో ముప్పు!
అమెరికాలోని అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్(Los Angels) అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు(California Fire) భారీ నష్టాన్ని కలిగించింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్(Los Angels) అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు(California Fire) భారీ నష్టాన్ని కలిగించింది. నగరంలోని చాలా ప్రాంతాలు, వేలాది భవనాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు గత 20 రోజులుగా అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ లాస్ ఏంజిల్స్‌ను వరుణుడు కరుణించాడు. శనివారం రాత్రి ఇక్కడ ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదైంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా మంటలు చెలరేగకుండా ఈ వర్షం దోహదపడుతుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఇక్కడే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. కొండప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్స్ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటివి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని, ఇందుకోసం సంసిద్ధంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, ఆస్బెస్టాస్, ప్లాస్టిక్, సీసం వంటివి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన మొదలైంది. దీంతో ఈ కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.