రైల్వే ఎగ్జామ్‌లో వేలిముద్ర మార్పిడి.. కోసి ఫ్రెండ్‌కిచ్చాడు.. చివరికి..
ఉద్యోగాన్ని పొందాలనే ప్రయత్నంలో పెద్ద తప్పు చేశాడు. Railway job aspirant peels off thumb skin, puts on friend's hand.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు తరబడి కష్టపడుతుంటారు యువత. అయితే, కొందరు మోసగాళ్లు షార్ట్ కట్‌లో ఉద్యోగం సంపాదించాలని మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాగే, బీహార్‌కు చెందిన ఓ యువకుడు పోటీ పరీక్షల్లో రైల్వే ఉద్యోగాన్ని పొందాలనే ప్రయత్నంలో పెద్ద తప్పు చేశాడు. బయోమెట్రిక్‌తో అభ్యర్థిని గుర్తిస్తారు కనుక వేలిముద్రనే మార్చేశాడు. దాని కోసం తన బొటన వేలు చర్మాన్ని పాన్‌పైన వేడి చేసి, ఒలిచాడు. దాన్ని తన స్నేహితుడి బొటన వేలికి అతికించాడు. దీనితో, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను క్లియర్ చేసి, అతని స్థానంలో తన ఫ్రెండ్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు అవుతాడని ఆశించాడు.
అయితే, ఆగస్టు 22న గుజరాత్‌లోని వడోదర నగరంలో రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్ష జరగ్గా, ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో పరీక్ష సూపర్‌వైజర్ వేలుపై శానిటైజర్‌ను స్ప్రే చేయడంతో ఆ దొంగ అభ్యర్థి చేతికి అతికించిన బొటనవేలు చర్మం కాస్తా ఊడిపోయింది. ఈ ఘటనలో బీహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన అభ్యర్థి మనీష్ కుమార్, అతని ప్రాక్సీ రాజ్యగురు గుప్తాలపై మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేసి, వడోదర పోలీసులు అరెస్టు చేశారు. 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన 20 ఏళ్ల ఈ ఇద్దరు యువకుల ఉజ్వల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యింది.