Rahul gandhi: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరిస్తాం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్, ఇండియా కూటమి తొలి ప్రాధాన్యత అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడమే కాంగ్రెస్, ఇండియా కూటమి తొలి ప్రాధాన్యత అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. కశ్మీర్, లడఖ్ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర హోదా ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నమ్మకాన్ని వమ్ము చేశామని తెలిపారు. కాంగ్రెస్ భావజాలం. ఇండియా కూటమి ప్రేమ, ఐక్యత. గౌరవంపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
వీలైనంత త్వరగా కశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించబడతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజలతో తనకు చాలా లోతైన సంబంధం ఉందని ఇక్కడికి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పారు.
మోడీ అబద్దాల గురువు: మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సైతం సభలో ప్రసంగించారు. మోడీ అబద్ధాల మాస్టర్ అని, ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలను కోరారు. దేశాన్ని రక్షించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నొక్కి చెప్పారు. మోడీ పాలనలో జమ్మూ కశ్మీర్‌లో 2,350 తీవ్రవాద సంఘటనలు జరిగాయని, 377 మంది పౌరులు మరణించారని గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో గెలిస్తే భారతదేశం మొత్తం కాంగ్రెస్ ఆధీనంలోకి వస్తుందని తెలిపారు. కాగా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి.