Rahul Gandhi: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

Update: 2024-09-04 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని రాంబన్, అనంత్‌నాగ్‌లలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘భారతదేశ చరిత్రలో రాష్ట్ర హోదాను కోల్పోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా రూపాంతరం చెందాయి. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ జరగలేదు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరాం, కానీ అది బీజేపీకి ఇష్టం లేదు అని చెప్పారు.

లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తీరుపై మండిపడిన రాహుల్..‘జమ్మూ కశ్మీర్ లో ఒక రాజు కూర్చున్నాడు. అతని పేరు ఎల్జీ. ఆయన మీ సంపదను తీసుకొని బయటి వ్యక్తులకు తాను లబ్ధి పొందుతున్న కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు’ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటను ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని, అభ్యర్థుల వయస్సును 40 ఏళ్లకు పెంచుతామని తెలిపారు. రోజువారీ కూలీలను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోలో ఇప్పటికే దీనిపై హామీ ఇచ్చిందని నొక్కి చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో ద్వేషం, హింస, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. కానీ ప్రేమను విస్తరించడమే ఇండియా కూటమి పని అని చెప్పారు.

ఇద్దరు బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నారు. కశ్మీరీ పండిట్‌ల సమస్యను రాజకీయ కారణాల కోసం మాత్రమే బీజేపీ ఉపయోగించుకుందని ఫైర్ అయ్యారు. కశ్మీరి పండిట్లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వారి కార్పొరేట్ మిత్రులు మాత్రమే నడుపుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీని సవాల్ చేసేందుకు విపక్షాలు కలిసి ఇండియా కూటమితో ఐక్యం కావడంతో ఆయన విశ్వాసం తగ్గిపోయిందన్నారు.


Similar News