Rahul Gandhi violated security guidelines 113 times in 2 years

భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్ అధికారులు ఖండించారు.

Update: 2022-12-29 06:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్ అధికారులు ఖండించారు. రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. నిజానికి రాహుల్ గాంధీనే అనేక సందర్భాల్లో సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీకి అనేక సందర్భాల్లో భద్రతా కల్పించడంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, డిసెంబర్ 24 న జరిగిన భారత్ జోడో యాత్రలో తమ నాయకుడి భద్రతను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు.

యాత్ర పంజాబ్, జమ్ము కాశ్మీర్‌ వంటి సున్నితమైన ప్రాంతాలకు ప్రవేశిస్తున్నందున రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించాలని కోరారు. అయితే వేణుగోపాల్ లేఖ రాసిన మరుసటి రోజే సీఆర్పీఎఫ్ విభాగం స్పందించింది. రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించారని వెల్లడించింది. 2020 నుండి రాహుల్ గాంధీ 113 సార్లు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని పారామిలటరీ ఫోర్స్ తెలిపింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలోనూ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఉల్లఘించాడని ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ విడిగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్ర పోలీసులు మరియు ఇతర ఏజెన్సీల సమన్వయంతో సీఆర్ఫీఎఫ్ బలాలు రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. 


Similar News