ప్రధానికి మణిపూర్ కన్నా ఇజ్రాయెల్‌పైనే ఇంట్రెస్ట్ ఎక్కువ : Rahul Gandhi
ఐజ్వాల్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండపై కంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘మణిపూర్‌లో జరుగుతున్న హింస గురించి వదిలేసి.. ఎక్కడో ఇజ్రాయెల్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని ఆసక్తి చూపడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని ఆయన పేర్కొన్నారు. మణిపూర్‌లో జరిగిన ఘటనల్ని తలుచుకుంటే, జూన్ నెలలో తాను కలిసిన బాధితుల గోడును గుర్తు చేసుకుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. మిజోరాంలో వచ్చే నెలలో అసెంబ్లీ పోల్స్ ఉండటంతో సోమవారం ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ‘‘మణిపూర్ ప్రజల కలల్ని బీజేపీ ప్రభుత్వం చిదిమేసింది. భారత సర్కారుపై వారికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసింది.
ఇప్పుడు మణిపూర్ ఒక రాష్ట్రం కాదు.. రెండు రాష్ట్రాలు’’ అని మైతే, కుకీ తెగల మధ్య కొనసాగతున్న ఘర్షణను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. ‘‘మణిపూర్ ప్రజలు హత్యలకు గురైనా, మహిళలు వేధింపులకు గురైనా, పసిపిల్లలు చంపబడినా.. అక్కడికి వెళ్లడం అంత ముఖ్యం కాదని ప్రధాని మోడీ భావిస్తున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. కాగా, సోమవారం ఐజ్వాల్ లోని చన్మరి జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. 40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.