'రాహుల్ ర్యాలీలు చూస్తుంటే ‘గజిని’ గుర్తుకొస్తోంది'

Update: 2023-10-30 16:41 GMT

రాయ్‌పూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీ ఎన్నికల ప్రసంగాలను వింటుంటే తనకు ‘గజిని’ సినిమా గుర్తుకొస్తోందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘‘గజిని మూవీలో ప్రధాన పాత్ర షార్ట్ టర్మ్ మెమొరీ లాస్‌తో బాధపడుతుంటుంది. ఏదైనా చెప్పినా, చేసినా మర్చిపోతుంటుంది. అలాగే రాహుల్ గాంధీ కూడా 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన హామీలను మర్చిపోతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ జ్ఞాపకశక్తి కోల్పోయి బాధపడుతున్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను వారు మర్చిపోయారు. మళ్లీ కొత్తగా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు’’ అని ఫడ్నవీస్‌ విమర్శించారు.

ఎయిర్ అంబులెన్స్ ప్రారంభిస్తామని గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కానీ సాధారణ అంబులెన్స్ సేవలను కూడా విస్తరించలేకపోయిందని మండిపడ్డారు. ‘‘బీహార్‌లో ‘పశువుల దాణా’ తిన్నారని, స్కాం చేశారని విన్నాం.. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ‘పేడ’ను తిన్నారని, స్కాం చేశారని వింటున్నాం’’ అని ఆయన ఆరోపించారు. ఆవు పేడను సేకరించే పథకంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను ఈసందర్భంగా గుర్తుచేశారు. ‘‘మద్యం బాటిళ్లపై పెట్టే నకిలీ హోలోగ్రామ్‌ల తయారీ మాఫియాకు సీఎం బఘేల్ ప్రభుత్వం సహాయం చేసింది. అలా వచ్చిన రూ.2వేల కోట్లనే ఇప్పుడు ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టారు’’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News