Rahul Gandhi: ఏప్రిల్ 19 నుంచి అమెరికా పర్యటించనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి అమెరికా పర్యటనకు రెడీ అయ్యారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి రాహుల్ గాంధీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి అమెరికా పర్యటనకు రెడీ అయ్యారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి రాహుల్ గాంధీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా టూర్‌లో భాగంగా బ్రౌన్ యూనివర్సిటీని రాహుల్ గాంధీ సందర్శించనున్నట్లు సమాచారం. బోస్టన్‌లో ఎన్ఆర్ఐలతో రాహుల్ గాంధీ.. భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను, స్టూడెంట్స్‌తో రాహుల్ గాంధీ సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాహుల్ అమెరికా పర్యటన ఎన్నిరోజులు ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. రాహుల్ గాంధీ అమెరికా టూర్ గురించి అధికారిక సమాచారం బయటికి రాలేదు.
అమెరికా పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక గతంలో రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో రాహుల్ గాంధీ 3 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఆ పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. భారత్‌లో మత స్వేచ్ఛ, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత్‌లోని ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ సమయంలో రాహుల్ గాంధీ వెల్లడించారు. అంతేకాకుండా అభివృద్ధిలో ఆయా వర్గాల భాగస్వామ్యం కూడా చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను, ఆరోపణలను అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో ఖండించింది.