Rahul Gandhi: భారత్- అమెరికా సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా

భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-09-08 09:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మూడు రోజుల పర్యటన కోసం రాహుల్ అమెరికాకు చేరుకున్నారు. డల్లాస్ లోని ఎయిర్ పోర్టుకి చేరుకోగానే రాహుల్ గాంధీకి.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ సామ్ పిట్రోడా, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రవాస భారతీయులు ఘనం స్వాగతం పలికారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రాహుల్ స్పందించారు. ‘‘ ప్రవాస భారతీయులు, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యుల నుంచి డల్లాస్‌లో లభించిన ఆత్మీయ స్వాగతానికి సంతోషిస్తున్నాను. అర్థవంతమైన చర్చలు, ఆసక్తికరమైన చర్చల్లో పాల్గొనడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనలో కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత పర్యటన

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన అమెరికా పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ 8వ డల్లాస్‌లో, సెప్టెంబర్ 9-10 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో రాహుల్ పర్యటన జరగనుంది. విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్‌ ట్యాంక్‌ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఆయన విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మరోవైపు, ఈ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా మాట్లాడారు. రాహుల్‌ పర్యటన అధికారికంగా కాదని.. వ్యక్తిగత హోదాలో చేపట్టిందని వెల్లడించారు.


Similar News