పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉపశమనం..
పరువు నష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది.
ముంబై: పరువు నష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. ఆయన నేరుగా విచారణకు హజరు కానవసరం లేదని థానే జిల్లా కోర్టు శనివారం పేర్కొంది. ఓ ప్రసంగంలో మహాత్మా గాంధీ హత్యకు కారణమని ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలు చేశారని కార్యకర్త రాజేష్ కుంటే 2014లో భివాండి మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను కించపరిచేలా ఉందని కుంటే పేర్కొన్నారు.
2018లో కోర్టుకు హజరైన రాహుల్ తాను నిర్దోషినని తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణలకు రాహుల్ ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన లేదని కోర్టు ఆదేశాల్లో తెలిపింది. కాగా, ఈ మధ్యనే పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు పడింది. అయితే కోర్టు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేయగా, ఆయన తీర్పును సవాల్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు జూన్ 3 వరకు కుంటేకు సమయమిచ్చింది.