Rahul gandhi: శివాజీ విగ్రహ తయారీలో అవినీతి.. రాహుల్ గాంధీ విమర్శలు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.

Update: 2024-09-05 12:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. విగ్రహ ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు క్షమాపణలు చెప్పారో అర్థం కావడం లేదున్నారు. ‘శివాజీ విగ్రహాన్ని తయారు చేసే కాంట్రాక్ట్ ఎటువంటి అర్హత లేని ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తికి ఇచ్చినందుకా? లేక విగ్రహ తయారీ ప్రక్రియలో అవినీతికి కారణమైనందుకా?’ అని ప్రశ్నించారు. విగ్రహం నిర్మించిన కొద్ది నెలలకే కూలిపోయిందని, ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని అన్నారు. కేవలం శివాజీకే గాకుండా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ మోడీ సారీ చెప్పాలన్నారు.

కాంట్రాక్టులన్నీ అదానీ, అంబానీలకే ఎందుకు ఇచ్చారో, కేవలం ఇద్దరు వ్యక్తుల కోసమే ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని దీనికి కూడా మోడీ క్షమాపణ చెప్పాలని ఫైర్ అయ్యారు. ఏడాదిన్నర కాలంగా హింస జరుగుతున్నా మణిపూర్‌ను సందర్శించలేదని తెలిపారు. మహారాష్ట్ర ఎప్పుడూ ప్రగతిశీల రాష్ట్రమని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలేలు చూపిన మార్గం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని తెలిపారు. ఈ మహోన్నత సభ్యుల భావజాలం కాంగ్రెస్ మాదిరిగానే ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో రెండు సిద్ధాంతాల మధ్య మాత్రమే పోరు జరుగుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. 


Similar News