54వ ఏట అడుగుపెట్టిన రాహుల్.. బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేతో కలిసి కేక్ కట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. 54 వ ఏట అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గొప్ప వేడుకలు నిర్వహించకూడదని, దానికి బదులుగా దాతృత్వ కార్యక్రమాలు, మానవతా సాయాన్ని అందించడం లాంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యాలయం దగ్గర ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్‌లు, బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్‌లో రాహుల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు, మీ అన్ని పనుల్లో భిన్నత్వం, సామరస్యం, కరుణలో ఏకత్వం అనే కాంగ్రెస్ పార్టీ తత్వం కనిపిస్తుంది. విలువలకు కట్టుబడటంలో మీకు మీరే సాటి. సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు ఖర్గే ఎక్స్‌లో రాశారు.
ప్రియాంక గాంధీ ఎక్స్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు, రాహుల్ నా స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త, నాయకుడు. జీవితం, విశ్వం, ప్రతిదానిపై ప్రత్యేక దృక్పథం మార్గాన్ని వెలిగించే నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు వెలుగొందుతూనే ఉండాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్‌లో రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే, డియర్ బ్రదర్ రాహుల్ గాంధీ! దేశ ప్రజల పట్ల మీ అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. నిరంతరం పురోగమిస్తూ, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను" అని స్టాలిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, దీర్ఘకాలం, విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఇన్‌ఛార్జ్, ఆర్గనైజేషన్, వేణుగోపాల్ ఎక్స్‌లో, రాహుల్ జీ భారతదేశంలోని పేద, అట్టడుగు, వెనుకబడిన పౌరులకు తిరుగులేని నాయకుడు. గొంతులేని వారి స్వరం, మన రాజ్యాంగ సంరక్షకుడు, అత్యుత్తమ న్యాయ యోధ, భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రకాశవంతమైన ఆశ! అని రాశారు.
ఇంకా పవార్ కుమార్తె, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (యుబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని ఆశ్రయ గృహాల్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్ కూలర్లను పంపిణీ చేశారు.