Rahul Gandhi : ముస్లింలపై దాడులు చేస్తే సహించం : రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. గోమాంసాన్ని తరలిస్తున్నారు, తింటున్నారనే కారణాలతో ముస్లింలపై ఇటీవలే జరిగిన రెండు వేర్వేరు దాడి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్డీయే సర్కారు హయాంలో దేశ ప్రజల్లో భయం బాగా పెరిగిపోయిందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కొందరు రెచ్చిపోతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘‘ద్వేషాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని అధికార పీఠం ఎక్కిన వాళ్లు.. దేశంలో భయ వాతావరణాన్ని పెంచి పోషించేందుకు నిత్యం యత్నిస్తున్నారు.
అల్లరిమూకల రూపంలో విద్వేష శక్తులు రెచ్చిపోతున్నాయి. సమన్యాయ భావనను సవాల్ చేసేలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. అలాంటి దాడులను మేం సహించం’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గోమాంసం తీసుకెళ్తున్నాడంటూ ఆగస్టు 28న మహారాష్ట్రలోని థానేలో 72 ఏళ్ల అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్‌పై ఆరుగురు అల్లరిమూకలు దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 27న హర్యానాలోని చర్ఖీ దాద్రిలో గోమాంసం తిన్నందుకు సాబిర్ మాలిక్ అనే బెంగాల్ వలస కార్మికుడిపై గోసంరక్షణ దళం దాడి చేసింది. దీంతో అతడు చనిపోయాడు.