‘రావణుడు’గా రాహుల్, ‘జుమ్లా బాయ్’గా మోడీ.. ముదురుతున్న పోస్టర్ వార్!
ఐదు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ కాకరేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ కాకరేపుతోంది. బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన రాహుల్ ఫోటో వివాదానికి దారి తీసింది. 7 తలలతో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను బీజేపీ షేర్ చేయగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ ఫోటోకు కౌంటర్ గా కాంగ్రెస్ సైతం ‘ది బిగ్గెస్ట్ లయ్యర్’, ‘జుమ్లా బాయ్’ అంటూ ప్రధాని ఫోటోలను షేర్ చేసింది.
ప్రియాంక గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వివాదంపై స్పందించారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాలు పాలిటిక్స్ ను ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. హింసను ప్రేరేపించే అభ్యంతర కర పోస్టులు మీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడాన్ని సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారాన్ని మీ హామీలలాగే మర్చిపోయారా అంటూ సెటైర్ వేశారు. జైరాం రమేష్, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం తాజా వివాదంపై స్పందించారు.
అసభ్యకరంగా రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ బీజేపీ పెట్టిన పోస్ట్‌ను ఖండించేందుకు మాటలు రావడం లేదన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలను చంపినట్లే రాహుల్ గాంధీని బీజేపీ నేతలు చంపాలనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. చిన్న చిన్న కారణాలు చెప్పి రాహుల్‌కు ఎస్పీజీ భద్రతను తగ్గించారన్నారు. రాహుల్ గాంధీని తన ఇంట్లోంచి ఖాళీ చేయించారని మండి పడ్డారు. రిక్వెస్ట్ చేసినా రాహుల్ గాంధీకి మరో ఇళ్లు కేటాయించలేదని ఆరోపించారు. విద్వేష పూరిత భావజాలాన్ని ఖండిస్తున్నందుకే రాహుల్ గాంధీని కాషాయ పార్టీ టార్గెట్ చేసిందని ఆయన అన్నారు.