Priyanka Gandhi : పార్లమెంట్‌లో ప్రియాంక ఫస్ట్ స్పీచ్.. బీజేపీపై ఘాటు విమర్శలు

సంవిధాన్(రాజ్యాంగం) అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు.

Update: 2024-12-13 10:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సంవిధాన్(రాజ్యాంగం) అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్‌లో తొలి సారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయం, భావప్రకటన, ఐకమత్యానికి రాజ్యాంగం ‘సురక్షా కవచ్‌’లా పనిచేస్తోందన్నారు. అయితే గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పేవాళ్లు దాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ పేరును ప్రస్తావించకుండానే.. ఒక్కరికి ప్రయోజనం చేసేందుకు 142 కోట్ల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు, వనరులు, డబ్బులు కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయన్నారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైన్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఒక్కరి చేతిలో పెట్టారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ, రిజర్వేషన్ కోటాలను నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయ సూత్రాలను బీజేపీ అణగదొక్కుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వచ్చి ఉంటే ఇప్పటికే వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించి ఉండేవారని ఆరోపించారు. గెలిచినా ఓడినంత పని కావడంతో రాజ్యాంగ మార్పు ఈ దేశంలో సాధ్యం కాదని బీజేపీకి అర్థమైందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ అంటుంటే బీజేపీ మాత్రం తమ వైఖరిని దాటవేస్తోందన్నారు. కులగణన గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే వారు మాత్రం మంగళసూత్రాన్ని అపహరించుకుపోతారని అంటున్నారని ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tags:    

Similar News