Kerala: శనివారం వయనాడ్‌ను సందర్శించనున్న ప్రధాని మోడీ
కేరళలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 10) పర్యటించనున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 10) పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకు ప్రధాని కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టకర్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపడతారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రెస్క్యూ ఆపరేషన్, అక్కడ జరుగుతున్న పునరావాస పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత సహాయక శిబిరాలు, ఆసుపత్రులను సందర్శించి గాయపడిన వారు, ప్రాణాలతో బయటపడిన వారిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని అక్కడి పరిస్థితులు, నష్టం, బాధితులకు చేయాల్సిన సహాయంపై అధికారులతో చర్చిస్తారు. మోడీ పర్యటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, బాధితుల పునరావాసం కోసం కేంద్ర సహాయం అందించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.