ప్రధాని మోడీ ఒక ‘షెహన్ షా’: ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ఒక ‘షహన్‌షా’(రాజులకే రాజు)అని అభివర్ణించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ఒక ‘షహన్‌షా’(రాజులకే రాజు)అని అభివర్ణించారు. గుజరాత్‌లోని బనస్కాంత లోక్ సభ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాహుల్ గాంధీని మోడీ పదే పదే యువరాజు అని పిలవడంపై ప్రియాంక స్పందించారు. ‘మోడీ నా సోదరుడిని యువరాజు అని పిలుస్తారు. కానీ ఆ యువరాజు దేశంలోని సోదరీమణులు, రైతులు, కూలీల సమస్యలు తెలుసుకునేందుకు 4000 కిలోమీటర్లు నడిచారు. కానీ మోడీ మాత్రం రాజభవనంలోనే నివసిస్తున్నాడు. ప్రజలతో సంబంధాలు లేకుండా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
‘మోడీ ముఖం, రాహుల్ గాంధీ ముఖాన్ని చూడండి తేడా స్పష్టంగా కనపడుతుంది. మోడీ బట్టలు శుభ్రంగా ఉంటాయి. ఒక్క వెంట్రుక కూడా దారి తప్పి ఉండదు. ఎందుకంటే ఆయన ప్యాలెస్‌లలో నివసిస్తున్నారు’ అని విమర్శించారు. ప్రజలతో సంబంధాలు లేని నాయకుడు వారి సమస్యలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని వారి మాటల్లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. గత పదేళ్లలో మోడీ చేసిన అతిపెద్ద పని రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను ధ్వంసం చేయడమేనని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు.
ఇటీవల గుజరాత్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ..యువరాజును ప్రధాని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని ఆరోపించారు. దేశ శత్రువులు బలహీనమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు. తదుపరి ప్రధానిగా రాహుల్ ను చూడాలని పాకిస్థాన్ ఎంతో ఆసక్తితో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, బనస్కాంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జెనిబెన్ ఠాకోర్ బరిలో నిలిచారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది.