ప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా షెఫాలీ బి శరణ్
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ (PDG)(ప్రభుత్వ అధికార ప్రతినిధి)గా షెఫాలీ బి శరణ్‌ను నియమిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ (PDG)(ప్రభుత్వ అధికార ప్రతినిధి)గా షెఫాలీ బి శరణ్‌ను నియమిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నటువంటి మనీష్ దేశాయ్ పదవీకాలం మార్చి 31న ముగియనుండటంతో షెఫాలీని కొత్తగా నియమించారు. ఆమె ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS) అధికారి అయిన శరణ్ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా విజయవంతంగా పనిచేశారు. అలాగే, ఆమె రైల్వే మంత్రిత్వ శాఖకు చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత PIBకి సారథ్యం వహించే మొదటి మహిళా అధికారి శరణ్ కావడం విశేషం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, విజయవంతమైన పనుల గురించిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేస్తుంది. ఇది ప్రభుత్వానికి, మీడియాకు మధ్య ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. అలాగే, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి అందిస్తుంది.