ఇకపై పరీక్షల్లో మోసాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు, కోటి జరిమానా
పబ్లిక్ పరీక్షలలో 'అక్రమ మార్గాలను' అనుసరించకుండా నిరోధించడానికి, పారదర్శకత, విశ్వసనీయతను తీసుకొచ్చేందుకు ఈ బిల్లు
దిశ, నేషనల బ్యూరో: ప్రభుత్వ పోటీ పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నివారణ బిల్లు-2024ను ఇటీవల ఉభయసభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ పరీక్షలలో 'అక్రమ మార్గాలను' అనుసరించకుండా నిరోధించడానికి, పారదర్శకత, విశ్వసనీయతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో పాటు అధికారిక గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేది నుంచి ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం, ప్రభుత్వ పోటీ పరీక్షల్లో పేపర్ లీకెజీ, మాల్ ప్రాక్టీస్, నకిలీ వెబ్‌సైట్లు తెరవడం లాంటి చర్యలకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా రూ. కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలోని పబ్లిక్ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, రిక్రూట్‌మెంట్ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ ఆఫీసులు ఉన్నాయి. అలాగే, నీట్, జేఈఈ, సీయూఈటీ లాంటి ఎంట్రెన్స్ పరీక్షలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది.