నేటి నుంచే ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు షురూ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఈ నెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఈ నెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 7 రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. నేడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గోవు సమర్పణ జరగనుంది.
జనవరి 17
రామ్ లల్లా విగ్రహ ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని మోసే భక్తులు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటారు.
జనవరి 18
గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం ఉంటుంది. అంతేగాక వాస్తు పూజలతో అధికారిక ఆచారాలు ప్రారంభమవుతాయి.
జనవరి 19
ఉదయం ఔషధాధివాసం, కేశరాధివస్, ఘృతాధివాసం క్రతువులు జరుగనుండగా.. సాయంత్రం ధాన్యాధివస్ కార్యక్రమం చేపట్టనున్నారు.
జనవరి 20
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నదీ జలాలతో శుభ్రం చేస్తారు.
జనవరి 21
రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు.
జనవరి 22
కీలక కార్యక్రమమైన ‘ప్రాణ పత్రిష్ట’ వేడుక జనవరి 22న 12.30గంటలకు ప్రారంభం కానుంది. 21, 22తేదీల్లో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. 23న భక్తుల సందర్భనకు అనుమతిస్తారు. ఈ వేడుకకు 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.