ఒక్క ఓటరు కోసం 39 కిలోమీటర్ల కాలినడక

దిశ, నేషనల్ బ్యూరో : ఓట్ల పండుగను విజయవంతం చేసేందుకు ఎన్నికల సంఘం చేసే కసరత్తు అంతాఇంతా కాదు.

Update: 2024-03-27 18:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓట్ల పండుగను విజయవంతం చేసేందుకు ఎన్నికల సంఘం చేసే కసరత్తు అంతాఇంతా కాదు. అంకితభావంతో కూడిన ఎన్నికల సిబ్బంది సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా బార్డర్‌కు సమీపంలో ఉన్న మాలోగం గ్రామంలో ఒకే ఒక్క ఓటరు ఉన్నారు. అయినా సరే ఏప్రిల్ 19న జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అక్కడ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది టీమ్, భద్రతా దళాలు కలిసి దాదాపు 39 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లనున్నారు. ఈక్రమంలో మార్గం మధ్యలో వాగులు, కొండలను దాటనున్నారు. ఈ పరిస్థితి ఎందుకంటే మాలోగంకు చేరుకునేందుకు నేటికీ పక్కా రోడ్లు లేవు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రతిసారీ ఎన్నికల్లో అక్కడ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తుంటారు. మాలోగం పోలింగ్ బూత్ పరిధిలో నమోదై ఉన్న ఒకే ఒక్క ఓటరు పేరు.. సోకెలా తయాంగ్(44). గతంలో ఈ ఊరిలో రెండు ఓట్లు ఉండేవి. మరో ఓటు సోకెలా తయాంగ్ భర్తదే. అయితే వీరిద్దరూ విడిపోయి 15 ఏళ్లు అవుతోంది. అతడు తన ఓటును అరుణాచల్ ప్రదేశ్‌లోని మరోచోటుకు మార్చుకున్నాడు. వాస్తవానికి ప్రస్తుతం సోకెలా తయాంగ్ కూడా ఈ ఊరిలో ఉండటం లేదు. తన పిల్లల చదువుల కోసం ఆమె వాక్రో అనే పట్టణానికి వలస వెళ్లింది. వాక్రో పట్టణం నుంచి మాలోగం గ్రామానికి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈసారి ఓటు వేసేందుకు సోకెలా తయాంగ్ కూడా ఎన్నికల సిబ్బంది కంటే ఎక్కువ దూరమే ప్రయాణించి మాలోగంకు చేరుకోనుంది.

Tags:    

Similar News