ఈవీఎంలు, అర్బన్ ఓటర్లపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో జరగబోయే ఎన్నికల వైపే ప్రపంచమంతా చూస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ అన్నారు.

Update: 2024-03-16 16:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో జరగబోయే ఎన్నికల వైపే ప్రపంచమంతా చూస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతీ ఎన్నిక ఒక పరీక్ష లాంటిదేనని, ప్రతీ పరీక్షలోనూ విజయం సాధించాలనేది ఈసీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో విలేకరుల సమావేశం వేదికగా దేశ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేశారు. ఈసందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నగరాలు, పట్టణాల్లోని ఓటర్ల ఉదాసీనతపై సీఈసీ ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్ ఓటర్లు ఉదాసీనతను విడనాడి, ఈసారి ఓటు వేసేందుకు నవ చైతన్యంతో కదం తొక్కాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటి ఎదుటే పోలింగ్ బూత్ ఉన్నా.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపని వాళ్లు కూడా ఉన్నారని ఆయన ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ప్రజల ఇళ్ల నుంచి సగటున 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని రాజీవ్ తెలిపారు. 2024 సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరంగా పిలవొచ్చన్నారు. ఈ ఏడాది భారత్ సహా చాలా దేశాల్లో ఓట్ల పండుగ జరగబోతోందన్నారు. ఈవీఎంలు 100 శాతం సేఫ్ అని సీఈసీ స్పష్టం చేశారు. హ్యాకింగ్ జరగొచ్చనే ప్రతిపక్షాల ఆందోళలను ఆయన కొట్టిపారేశారు. ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను అద్దంపట్టే ఓ ఉర్దూ కవితను రాజీవ్ కుమార్ చదివి వినిపించారు.

ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బంది ఉండరు

దేశంలో ఎన్నికలకు ఆటంకం కలిగించే ‘4ఎం’లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ‘4ఎం’లలో మనీ, మజిల్, మిస్ ఇన్ఫర్మేషన్, మోడల్ కోడ్ ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు యత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌ను మోహరిస్తామని సీఈసీ తెలిపారు. సున్నితమైన బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తామన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో 24x7 ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చెక్ పోస్ట్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు చేస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిని వినియోగించడం లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈ మీడియా సమావేశంలో ఓ సాధారణ వ్యక్తి కూడా సీఈసీని ఓ ప్రశ్న అడిగాడు. అయితే అతడు మీడియా ప్రతినిధి కాదు అని తేలడంతో అక్కడి నుంచి బయటికి పంపేశారు.

Tags:    

Similar News