మలయాళ నటుడు జయసూర్యపై రెండో కేసు

మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల వేధింపులకు సంబంధించిన ఒక్కొక్క ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2024-08-30 05:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల వేధింపులకు సంబంధించిన ఒక్కొక్క ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ వేధింపులకు సంబంధించి నటుడు జయసూర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం 354, 354A(A1)(I) 354D IPC కింద రెండో ఎఫ్‌ఐఆర్‌ ఆయనపై నమోదు చేశారు. నటి మిను మునీర్ నుంచి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తరువాత కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. విచారణలో భాగంగా మునీర్ తన అనుభవాలను వివరిస్తూ, ఒకసారి, తొడుపుజాలోని ఓ లొకేషన్‌లో నేను టాయిలెట్ నుండి బయటకు వస్తుండగా, జయసూర్య నన్ను వెనుక నుండి కౌగిలించుకుని, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, లైంగికంగా వేధించాడని తెలిపింది. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితులకు సంబంధించి ఇటీవల జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో ఈ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మిను మునీర్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 28న నటుడు, కొల్లంలోని సీపీఐ (ఎం) ఎమ్మెల్యే ముఖేష్‌పై తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మణియం పిళ్ల రాజు, ఇడవెల బాబు కూడా సినిమా ప్రాజెక్టుల కోసం పనిచేసే సమయంలో శారీరకంగా దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు.

హేమ కమిటీ నివేదిక తర్వాత మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటకు చెబుతున్నారు. గురువారం, నటి సోనియా మల్హర్ కూడా తన అనుభవాలను ప్రస్తావించారు. కెరీర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.


Similar News