సందేశ్‌ఖాలీ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
సందేశ్‌ఖాలీలో ప్రజల ఆలోచనా సరళీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మోడీ 'శక్తి స్వరూపిణి'గా అభివర్ణించారు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన లైంగిక వేధింపుల బాధితురాలు, బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన రేఖా పాత్రతో ఫోన్‌లో మాట్లాడారు. సందేశ్‌ఖాలీలో ప్రజల ఆలోచనా సరళీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మోడీ 'శక్తి స్వరూపిణి'గా అభివర్ణించారు. ఇదే సమయంలో సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల వేధింపులకు గురవతున్న వారి బాధల్ని ప్రధానీ మోడీకి వివరించారు. బెంగాలీలో ఫోన్ సంభాషణను ప్రారంభించిన మోడీ.. 'మీరు అతిపెద్ద బాధ్యతలను చేపట్టారు. సందేశ్‌ఖాలీలో మహిళలు గొంతు ఎత్తడం అంత సాధారణ విషయం కాదు. బెంగాల్‌లో నారీ శక్తి మిమ్మల్నీ ఆశీర్వదిస్తోందని మీ ధైర్యం చూస్తే తెలుస్తుంది. కేంద్రం చేసిన పనుల గురించి ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారు. వారు రాష్ట్రంలో కేంద్ర పథకాలను అమలు చేయనివ్వరని ' అన్నారు.
బీజేపీ అభ్యర్థిగా ఆమె ఎంపికపై సందేశ్‌ఖాలీ ప్రజలు ఎలా స్పందించారని మోడీ అడిగారు. ఏజెన్సీ అధికారులపై మూక దాడికి సంబంధించి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న తృణమూల్ నేత షేక్ షాజహాన్‌ను ప్రస్తావించిన రేఖా పాత్ర, '2011 నుంచి తాము ఇక్కడ ఓటు వేయలేదు. మా ఓటు వినియోగించుకునేందుకు సరైన భద్రత కావాలి. అందుకు మీ మద్దతుకు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ' చెప్పారు. సందేశ్‌ఖాలీలో మీరు పెద్ద యుద్ధమే చేశారు. నువ్వొక శక్తి స్వరూపిణి. బలవంతుడైన నేతను జైలుకు పంపారని మోడీ ప్రశంసించగా, మహిళల మద్దతుతోనే తాను చేయగలిగానని, వారు చూపిన మార్గంలో నడుస్తాను, అందరినీ వెంట తీసుకెళ్తానని రేఖా పాత్ర తెలిపారు.