దటీజ్ మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు.
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. "మేక్ ఇన్ ఇండియా" ప్రోగ్రాం ద్వారా ప్రధాని మోడీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని.. ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాస్కోలో జరిగిన ఓ ఈవెంట్లో అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారని అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది.
దీంతో స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చని గత కొంతకాలంగా రష్యా ప్రజలకు పుతిన్ పిలుపునిస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే తన ప్రసంగంలో "మేక్ ఇన్ ఇండియా" ప్రోగ్రాం గురించి పుతిన్ ప్రస్తావించారు. మరోవైపు భారత ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. రష్యాలో ఇటీవల జరిగిన తిరుగుబాటు, యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించి ఇరుదేశాల నేతలు మాట్లాడుకున్నారు. రష్యా ప్రైవేట్ మిలటరీ కంపెనీ వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును తాము తిప్పికొట్టిన విధానాన్ని మోడీకి పుతిన్ వివరించారు.