9.26 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ
వారణాసిలో జరిగిన కార్యక్రమంలో రూ. 20,000 కోట్ల మొత్తం రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పీఎం-కిసాన్ సమ్మాన్‌నిధి పథకం 17వ విడత నిధులను మంగళవారం విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో రూ. 20,000 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడంతో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయి. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడం, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ వారణాసిని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మూడోసారి పార్లమెంటును తమ ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు వారణాసి ప్రజలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. కాగా, ఈ నెల 9న వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ తన తొలి సంతకాన్ని పీఎం కిసాన్ 17వ విడత పత్రాలపై చేశారు. 2018 నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో రూ. 6,000 పెట్టుబడి సాయం అందుతుంది.