PM Modi : వయనాడ్ విపత్తు సాధారణమైంది కాదు : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు విరిగిపడి వయనాడ్‌లో చోటుచేసుకున్న విపత్తు సాధారణమైంది కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

Update: 2024-08-10 15:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు విరిగిపడి వయనాడ్‌లో చోటుచేసుకున్న విపత్తు సాధారణమైంది కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వందలాది మంది ప్రజలు ఈ ప్రకృతి విపత్తులో తమ సర్వస్వాన్నీ కోల్పోయారని ఆయన చెప్పారు. వయనాడ్ రిలీఫ్‌ క్యాంపులో తాను బాధితులను కలిశానని ప్రధాని వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ప్రభావిత గ్రామాల ప్రజల కలలన్నీ ఆవిరైపోయాయని, బాధిత కుటుంబాల స్థితిగతులను కళ్లారా చూశానని మోడీ పేర్కొన్నారు. వారికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఒంటరిగా లేరని.. వారి వెంటే యావత్ దేశం ఉందని చాటిచెప్పాలన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వయనాడ్‌కు వద్దామని తాను అనుకున్నానని.. అయితే సహాయక చర్యలకు తన వల్ల ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో రాలేదని ప్రధాని చెప్పారు.

స్వాగతం పలికిన కేరళ సీఎం, గవర్నర్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు ప్రధానమంత్రి శనివారం ఉదయం 11 గంటలకు కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేశ్‌ గోపి స్వాగతం పలికారు. అనంతరం వారంతా కలిసి వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు వెళ్లారు. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరిమట్టం, ముందక్కై, చూరల్ మల తదితర ప్రాంతాలను ప్రధానమంత్రి ఏరియల్ సర్వే చేశారు. కాల్‌పెట్టలో హెలికాప్టర్‌ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు మోడీ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహణ, బాధితుల తరలింపు జరిగిన తీరు గురించి అధికారులు ప్రధానమంత్రికి వివరించారు.

మెప్పాడి, చూరల్ మల గ్రామాల్లో..

మెప్పాడి, చూరల్ మల గ్రామాల్లో ఉన్న సహాయక శిబిరాలు, ఆయా గ్రామాల్లో బాధితులు చికిత్సపొందుతున్న ఆస్పత్రులకు ప్రధాని మోడీ వెళ్లారు. బాధిత కుటుంబాల వారిని మోడీ పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన చూరల్ మల గ్రామంలో నదిపై నుంచి ఆర్మీ తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బైలీ వంతెనపై నుంచి ప్రధాని నడిచారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆర్మీ సిబ్బందిని కూడా ఆయన పలకరించారు. అనంతరం కేరళ సీఎం విజయన్‌తో కలిసి ప్రధాని మోడీ వయనాడ్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా, వయనాడ్ విపత్తును కేంద్ర ప్రభుత్వం లెవల్ 3 జాతీయ విపత్తుగా గుర్తించాలని కేరళ సర్కారు కోరుకుంటోంది. ఆ కేటగిరీలో చేరిస్తే ప్రభావిత ప్రాంతాల ప్రజల ఇళ్ల పునర్మిర్మాణానికి, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మార్గం సుగమం అవుతుంది.

Tags:    

Similar News