PM Modi : మా పార్టీ చాలా ఓర్చుకొని ఈస్థాయికి ఎదిగింది : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీని, అంతకుముందున్న జనసంఘ్‌ను అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేశాయని.. చాలా ఓర్చుకొని ఎట్టకేలకు తమ పార్టీ ఇంతటి స్థాయికి ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

Update: 2024-09-02 14:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీని, అంతకుముందున్న జనసంఘ్‌ను అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేశాయని.. చాలా ఓర్చుకొని ఎట్టకేలకు తమ పార్టీ ఇంతటి స్థాయికి ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బీజేపీ దృష్టిలో సభ్యత్వ నమోదు అంటే పార్టీ సభ్యుల సంఖ్యను పెంచుకోవడం కాదని.. ఇది సైద్ధాంతిక, భావోద్వేగ ప్రచారానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ‘సంఘటన్ పర్వ, సదస్యతా అభియాన్ 2024’ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా బీజేపీ సభ్యత్వ రెన్యూవల్ సర్టిఫికెట్‌ను ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అందజేశారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇద్దరు ఎంపీలతో లోక్‌సభలో ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని, దానికి తాము పాటించే నేషన్ ఫస్ట్ సిద్ధాంతం, ప్రజా సంక్షేమ భావనే కారణమన్నారు. దేశ రాజకీయ సంస్కృతిని మార్చడానికి బీజేపీ తీవ్ర కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు.

అన్ని రికార్డులను బ్రేక్ చేస్తాం

ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. తదుపరిగా లోక్‌సభ, దేశంలోని అన్ని అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలవుతాయని ఆయన వెల్లడించారు. బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్‌‌లో భాగంగా 18 నుంచి 25 ఏళ్లలోపు వారికి లక్ష్యంగా చేసుకోవాలని పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు. కొత్త తరానికి పదేళ్ల క్రితం జరిగిన స్కామ్‌ల గురించి తెలియవని, వాటిని వివరించాలని సూచించారు. సభ్యత్వ నమోదు అంటే కుటుంబంలోకి కొత్త సభ్యులను స్వాగతించడం లాంటి పవిత్రమైన కార్యమన్నారు. ‘‘రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లోపిస్తే ఏమవుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుత విపక్ష పార్టీల పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం’’ అని మోడీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు. కాగా, ఆసక్తి కలిగినవారు 88 00 00 2024 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి తమ పార్టీలో సభ్యులుగా చేరొచ్చని పేర్కొంటూ బీజేపీ సోమవారం ఓ ట్వీట్ చేసింది.


Similar News