హత్యకు ముందు ఏడుస్తూ.. చొక్కాలేకుండా లారీ ఎదుట కూర్చున్న రేణుకాస్వామి
నటుడు దర్శన్ తూగుదీప తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న విషయం తెలిసిందే
దిశ, నేషనల్ బ్యూరో: నటుడు దర్శన్ తూగుదీప తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న విషయం తెలిసిందే. హత్యకు ముందు రేణుకాస్వామిని చిత్రహింసలకు గురి చేయగా, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఒక ఫొటోలో దాడికి ముందు రేణుకాస్వామి, చొక్కా లేకుండా పార్క్ చేసిన లారీల ముందు నేలపై కూర్చుని, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, మరో ఫొటోలో అతను లారీ ముందు అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ హత్య కేసులో కర్ణాటక పోలీసులు బుధవారం 3,991 పేజీల చార్జిషీట్‌ను సమర్పించిన తర్వాత ఈ ఫొటోలు వెలువడ్డాయి. దర్శన్ సహాయకుడు పవన్ ఫోన్‌లో ఈ ఫొటోలు లభ్యమయ్యాయని, వీటిని సాక్ష్యంగా పోలీసు శాఖ సేకరించిందని తెలుస్తుంది. లీకైన ఫోటోలకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న పవన్.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, షెడ్డులో ఉంచి ఫోటోలు తీశాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తర్వాత పవన్.. దర్శన్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న క్లబ్‌కి వెళ్లి ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూసిన తర్వాత, దర్శన్ నటి పవిత్ర గౌడ ఇంటికి వెళ్లి, రేణుకాస్వామిని ఉంచిన షెడ్‌కు ఆమెను తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దర్శన్, అతని గ్యాంగ్ దాడి చేయడంతో, రేణుకాస్వామి ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. అతని శరీరంపై మొత్తం 39 గాయాల గుర్తులు ఉన్నాయి. బాధితుడి తలపై లోతైన గాయం కూడా ఉంది అని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.