Kangana Ranaut: కంగనా రనౌత్ ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
సినిమాల నుంచి రాజకీయాల్లోకి మారి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌కు కొత్త చిక్కులు వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: సినిమాల నుంచి రాజకీయాల్లోకి మారి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌కు కొత్త చిక్కులు వచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలవగా, తాజాగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. పిటిషనర్, లాయక్ రామ్ నేగి, ఇటీవల ఎన్నికల్లో పోటీకి అవసరమైన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చినప్పటికి తప్పుడు కారణాలతో తిరస్కరించారని పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కంగనాను అనర్హురాలిగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ కంగనా స్పందనను కొరుతూ, హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
అటవీ శాఖ మాజీ ఉద్యోగి అయిన రామ్ నేగి తన పిటిషన్‌లో, నేను ముందస్తుగానే రిటైర్మెంట్ తీసుకున్నాను, ఎన్నికల్లో పోటీ చేయడానికి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలతో పాటు డిపార్ట్‌మెంట్ నుండి "నో డ్యూస్ సర్టిఫికేట్" సమర్పించాను. అయితే విద్యుత్, జలమండలి, టెలిఫోన్ శాఖల నుంచి ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వలేదు, వాటిని సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇవ్వడంతో గడువులోగా వాటిని అందించాను, కానీ రిటర్నింగ్ అధికారి వాటిని ఆమోదించ లేదు, నామినేషన్ పత్రాలను తిరస్కరించారు, నామినేషన్‌ని స్వీకరించి ఉంటే విజయం సాధించేవాడినని పిటిషన్‌లో తెలిపాడు.
మరోవైపు ఇటీవల మండి లోక్‌సభ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో కంగనా విజయం సాధించారు. సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, ఆమెకు 5,37,002 ఓట్లు వచ్చాయి.