Mohan Bhagwat : మనం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు

మనం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్( RSS chief Mohan Bhagwat) అన్నారు.

Update: 2024-09-06 10:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మనం దేవుళ్లమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్( RSS chief Mohan Bhagwat) అన్నారు. స్వయంగా మనమే దేవుడని ప్రకటించుకోవద్దని హితవు పలికారు. 1971లో కీలక నేత శంకర్‌ దిన్‌కర్‌ కానే (భయ్యాజీ) మణిపుర్‌లో చేసిన సేవలను గుర్తుచేసుకుంటా పూణేలో ఓ కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న మోహన్ భగవత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ పని తాము చేసుకుపోకుండా.. మెరుపులా మెరవాలని కోరుకుంటారు. కానీ, పిడుగు పడ్డాక అంధకారంగా మారుతుందని గుర్తించరని అన్నారు. కార్యకర్తలు ఒక దీపంలా .. అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలన్నారు. శంకర్‌ దిన్‌కర్‌ కానే(Shankar Dinkar Kane ) 1971లో మణిపుర్‌లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు. అక్కడినుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి వారికి విద్య అందించారన్నారు.

మణిపూర్ సంక్షోభం

ఈ సందర్భంగానే మణిపుర్‌ హింసపై(Manipur violence) మోహన్‌ భగవత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ పరిస్థితి సంక్లిష్టంగా, సవాలుగా మారిందని అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ వాలెంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగినప్పుడు అండగా నిలిచారన్నారు. ప్రస్తుతం మణిపూర్ లో భద్రతకు ఎలాంటి హామీ లేకుండా పోయిందన్నారు. స్థానికులే భద్రత విషయంలో సందేహపడుతున్నారని అన్నారు. వ్యాపారాలు, సేవా కార్యక్రమాలకు వెళ్లే వారి పరిస్థితి ఇంకా దారుణంగా మారిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘ్‌ అక్కడే ఉండి.. శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. సాధారణ ఎన్‌జీవోలు చేయలేని పనిని సంఘ్‌ చేస్తోందని మోహన్‌ భగవత్‌ వెల్లడించారు. మణిపూర్ సంక్షోభం కోసం సంఘ్ అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు. అన్ని పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే, మణిపూర్ అల్లర్లలో 200 మంది చనిపోగా.. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు.


Similar News