చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ పార్టీ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ (95) కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం 12. 20 గంటలకు మొహాలీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని.. అక్కడి నుంచి నేరుగా చండీగఢ్ లోని శిరోమణి అకాళీదళ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బాదల్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ప్రకాష్ సింగ్ బాదల్ శ్వాసకోశ సమస్యలతో గతవారం రోజులుగా మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. అయన భౌతిక కాయాన్ని పార్టీ శ్రేణుల సందర్శనార్ధం చండీగఢ్ లోని శిరోమణి అకాళీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
ప్రకాష్ సింగ్ బాదల్ మరణంపైమంగళవారం రోజే ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అయన మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టం కలిగించిందన్నారు. బాదల్‌తో తనకు ఎన్నో దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొ న్నారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని ట్వీట్ లో మోడీ తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలను జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతాప సూచకంగా గురువారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్వగ్రామం ముక్త్ సర్ లో ప్రకాష్ సింగ్ బాదల్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా..
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ 1927 డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జన్మించారు. బాదల్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్. 30 ఏళ్ల వయసులో 1957లోనే తొలిసారి ప్రకాశ్‌సింగ్ బాదల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 43 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగానూ రికార్డులకు ఎక్కారు. చివరిసారిగా బాదల్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలి ఓటమి, ఈవే చివరి ఎన్నికలు కూడా కావడం గమనార్హం.